రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం (జులై 15, 2025) పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జరిగింది. ప్రాచి కుమావత్ (9) అనే బాలిక రాజస్థాన్‌లోని సికార్ జిల్లా, దంతా-రామ్‌గఢ్ ప్రాంతంలోని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాల నాలుగో తరగతి చదువుతుంది. ప్రాచి తన టిఫిన్ డబ్బా తెరవడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను దంతా-రామ్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్ (CPR), ఆక్సిజన్ అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను సికార్‌లోని ఎస్కే ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఆమె షాక్‌లోకి వెళ్లిందని, సికార్ ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దంతా-రామ్‌గఢ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుభాష్ వర్మ మాట్లాడుతూ, బాలిక అపస్మారక స్థితిలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉందని, పల్స్, బీపీ లేవని, గుండె పనిచేయడం లేదని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించనప్పటికీ, ప్రాచి గుండెపోటుతో మరణించిందని పాఠశాల ప్రిన్సిపాల్, చికిత్స అందించిన వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.