Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా స్టోరీలైన్‌ను దర్శకుడు వశిష్ఠ మల్లిడి వెల్లడించారు. ఈ సినిమా ఒక సోషియో-ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోంది. దర్శకుడు వశిష్ఠ చెప్పిన దాని ప్రకారం, మన పురాణాల్లో చెప్పబడిన 14 లోకాల (ఏడు పైలోకాలు, ఏడు కింద లోకాలు) నేపథ్యం ఈ సినిమాలో ఉంటుంది. ఇప్పటికే అనేక సినిమాలు ఈ లోకాలను చూపించినప్పటికీ, ‘విశ్వంభర'(Vishwambhara ) వాటికి మూలమైన సత్యలోకాన్ని (బ్రహ్మలోకం) కూడా చూపించనుంది.
ఈ చిత్రంలో కథానాయిక త్రిష, 14 లోకాలకు పైన ఉన్న ‘విశ్వంభర’ అనే లోకానికి చెందినది. ఏదో ఒక కారణం చేత ఆమె భూమి మీదకు వస్తుంది. భూమి మీదకు వచ్చిన హీరోయిన్ను తిరిగి ఆమె లోకానికి (విశ్వంభర లోకానికి) తీసుకెళ్లడం కోసం హీరో చిరంజీవి ఎలాంటి ప్రయాణం చేశాడు, 14 లోకాలను దాటి సత్యలోకానికి ఎలా వెళ్లాడు, ఆమెను ఎలా తిరిగి దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాకు సుమారు 4676 VFX షాట్లు ఉన్నాయని దర్శకుడు తెలిపారు,
ఇది విజువల్స్ పరంగా సినిమాకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లేదా ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు ఇది సీక్వెల్ కాదని, కానీ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలుగుర్రం’, ఎన్.టి.ఆర్. ‘పాతాళభైరవి’ వంటి ఫాంటసీ సినిమాలు తమ చిత్రానికి స్ఫూర్తి అని వశిష్ఠ పేర్కొన్నారు. ఈ కథాంశం చిరంజీవి అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.